Tuesday, 23 July 2013

సిటీ దుస్థితి: అమ్మాయి ప్రాణం తీసిన బురద రోడ్డు

హైదరాబాద్: వానలకు తడిసిన రోడ్డు హైదరాబాద్‌లో ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. గోతులకు, బురదకు స్కూటర్ జారడంతో దానిపై నుంచి యువతి కింద పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బస్సు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. నిమిషాల్లో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మంగళవారం సాయంత్రం ఐదుగంటల సమయంలో హైదరాబాద్‌లో బేగంపేట నుంచి ప్యారడైజ్ వెళ్లే దారిలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో నివసించే సుశీల్‌కుమార్ కూతురు రియా (17). తన స్నేహితుడు విశాల్‌తో కలిసి మంగళవారం సాయంత్రం యాక్టివాపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది. వెనక కూర్చున్న రియా రోడ్డుమీద పడింది. ఆమె మీది నుంచి బస్సు దూసుకెళ్లింది. ట్రాఫిక్ పోలీసులు రియాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. తర్వాత కాసేపటికే ఈ ప్రాంతంలో మరో ద్విచక్రవాహనం కూడా జారి నేలపై పడిందని, ఆ వాహనాన్ని నడుపుతున్న యువకుడు కూడా కింద పడ్డాడని, అయితే, అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి గాయాలూ కాలేదని ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. గత వారం రోజులుగా హైదరాబాదులో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. వర్షం కురిస్తే హైదరాబాద్ రోడ్లు చిత్తడి చిత్తడి అవుతాయి. రోడ్లపై మోకాలు లోతు నీరు చేరుతుంది. ఈ రోడ్లపై ప్రయాణం నరకంలా ఉంటుంది.

Read more at: http://telugu.oneindia.in/news/2013/07/24/districts-muddy-road-kills-inter-girl-119865.html

No comments:

Post a Comment