Friday 9 August 2013

'తెలంగాణ' సెగతో రగిలిన ఉద్యమాలు

'తెలంగాణ' సెగతో రగిలిన ఉద్యమాలు

Written by Siramdasu Nagarjuna | Updated: August 03, 2013 20:16 (IST)
'తెలంగాణ' సెగతో రగిలిన ఉద్యమాలుబోడోలాండ్ ఉద్యమ తీవ్రత
యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యూసి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ప్రకటనతో చిన్నరాష్ట్రాల ఉద్యమాల తేనె తుట్టిని కదిపినట్లయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకు ఆమోదం తెలిపితే  దేశం మొత్తంలో చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకుంటాయని, అలా ఏర్పాటు చేస్తే దేశ సమాఖ్య వ్యవస్థకే భంగం కలుగుతుందని  సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు ముందే హెచ్చరించారు. వారు చెప్పిన విధంగానే తెలంగాణ ప్రకటనతో దేశంలోని ఈశాన్యం ప్రాంతం ఒక్కసారిగా  భగ్గుమంది. పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్, అస్సాంలో బోడోలాండ్, మహారాష్ట్రలో విదర్భ ఉద్యమాలు, ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.

అస్సాంలో బోడోలాండ్ ఉద్యమం ఉధృతరూపం దాల్చింది.  అస్సాంను నాలుగు రాష్ట్రాలుగా (బోడోలాండ్, కామ్తాపుర్, దిమా హసో, కర్బీ ఆంగ్‌లాంగ్) విభజించాలన్న డిమాండ్‌తో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. బోడో సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ బంద్ లు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఉద్యమం విధ్వంసాలకు, హింసకు కూడా దారి తీసి ప్రమాదస్థాయికి చేరింది. ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డు రవాణ శాఖ బస్సులును దగ్ధం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు.  అస్సాంలోని దిఫులో   ఎంపీ బెరైన్‌సింగ్ ఎంగ్టీ రబ్బరు తోటతోపాటు ఆయన ఇంటికి శుక్రవారం నిప్పుపెట్టారు. రైల్‌రోకోలో భాగంగా వివిధ బోడో సంఘాలకు చెందిన ఆందోళనకారులు దిఫు-లుండింగ్ సెక్షన్‌లో ఆరు కిలోమీటర్ల మేర పట్టాలను తొలగించారు. ప్రత్యేక బోడోలాండ్ కోసం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ నెల 5 నుంచి 1,500 గంటల బంద్‌కు పిలుపు ఇచ్చింది.

బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతంలో కూడా ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో బంద్ లు, ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.  డార్జిలింగ్ పట్టణంలో శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. ప్రక్రియతోంగ్ ప్రాంతంలో కొందరు దుండగులు ఓ హోంగార్డుకు నిప్పంటించారు. ఆందోళనకారులు పలు చోట్ల ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టారు.  తాక్‌దా ప్రాంతంలో  ఓ ఫారెస్ట్ బంగ్లాకు నిప్పంటించారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో న్యాయమైన తమ డిమాండ్లను కూడా పరిష్కరించాలని గూర్ఖాలాండ్, బోడోలాండ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ను విభజించి ప్రత్యేక గూర్ఖాలాండ్, అస్సాంను విభజించి ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయడం తప్ప ప్రస్తుతం తమకు మరో మార్గం లేదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ఎంపీ సాన్సుమా ఖున్గుర్ బిశ్వముతియారిలు హెచ్చరించారు. డార్జిలింగ్ పర్వతప్రాంతం ఎన్నడూ పశ్చిమబెంగాల్‌లో భాగం కాదని, తాము పశ్చిమబెంగాల్‌తో కలసి ఉండాలని కోరుకోవడం లేదని రోషన్ గిరి స్పష్టం చేశారు. ప్రత్యేక బోడోలాండ్ డిమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు 5న అస్సాంలోని కోక్రాఝర్‌లో బిశ్వముతియారి ర్యాలీకి పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినప్పుడు, బోడోలాండ్ ఎందుకు ఇవ్వదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై యుపిఏ తీసుకున్న నిర్ణయం ఈ ఉద్యమాలకు ఊపిరులూదినట్లయింది. ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో గూర్ఖాలాండ్ ఉద్యమం తిరిగి పుంజుకునేలా కేంద్రం రెచ్చగొడుతోందని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించిన నేపథ్యంలో చిరకాలంగా ఇదే తరహా డిమాండ్ చేస్తున్న విదర్భ ప్రజల ఆకాంక్షను కూడా నెరవేర్చాలని నాగపూర్  కాంగ్రెస్ ఎంపీ విలాస్ ముత్తెమ్వార్  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరుతూ లేఖ రాశారు. ప్రత్యేక తెలంగాణకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ బిఎస్ పి అధినేత్రి మాయావతి  ఉత్తరప్రదేశ్ ని కూడా నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె చెబుతున్నారు.  యూపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

 దేశంలో ఎన్నో ఏళ్లుగా  23 ప్రాంతాలలో కొత్తరాష్ట్రాల కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌ ఈశాన్య ప్రాంతం, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కలసి మొత్తం 13 జిల్లాలతో బుందేల్‌ఖంఢ్‌ రాష్ర్ట ఏర్పాటు కోసం 1956 నుంచి ఉద్యమం జరుగుతోంది. మహారాష్ర్టలో విరాది మాండలికం కలిగిన ప్రాంతాలైన 13 జిల్లాలతో కలిపి ప్రత్యేకంగా విదర్భ రాష్ర్టం కోసం 45 ఏళ్ళుగా ఉద్యమం జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిని రాజధానిగా చేసుకొని యూపిలోని 27 జిల్లాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలు కలిపి పూర్వాంచల్‌ రాష్ర్టం ఏర్పాటు చేయాలని ఆరు దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఇంకా మధ్యప్రదేశ్‌లో గోండ్వానా,  కాశ్మీర్‌లోని లడక్‌,  గుజరాత్‌లోని సౌరాష్ర్ట పేరుతో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఎంతోకాలంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు.

రాష్ట్రాల విభజన విషయంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ గానీ, బిజెపి గానీ ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను ఆలోచించకుడా రాజకీయ ప్రయోజనాలనే ఆలోచిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపించడంతో కాంగ్రెస్ ఆదరాబాదరగా తెలంగాణపై నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో బిజెపి నేతలు ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ వస్తున్నారు. సమయానుకూలంగా మాట్లాడటం వారికి అలవాటైపోయింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంత ఆషామాషీ విషయం కాదని ఆ పార్టీ అగ్రనేత లాల్‌కిషన్‌ అద్వానీ గతంలో పలుమార్లు చెప్పారు. బిజెపి కాడినాడ సమావేశంలో ఒక ఓటు-రెండు రాష్ట్రాలు అని చెప్పి, ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఊసు ఎత్తలేదు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో చత్తీస్‌గఢ్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు  విదర్భ రాష్ర్ట ఏర్పాటు ప్రస్తావన కూడా వచ్చింది. ఆ సమయంలో  ఉప ప్రధానిగా ఉన్న ఎల్.కె.అద్వానీ హొం శాఖను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయడాన్ని మహారాష్ట్రలో ఎక్కువ మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అందువల్ల అక్కడ శాసనసభలో తీర్మానం చేయాలని స్పష్టం చేశారు. కాని తెలంగాణ విషయంలో అందుకు విరుద్ధంగా, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తీర్మానం చేయకపోయినా పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ప్రకటిస్తామని బిజెపి పలుమార్లు ప్రకటించింది. కాంగ్రెస్ మాదిరిగా బిజెపి కూడా తెలంగాణపై ప్రేమతో కాకుండా రాజకీయ ప్రయోజనాలు అశించే తెలంగాణకు మద్దతు పలుకుతోందని స్సష్టమవుతోంది.

No comments:

Post a Comment