Friday 9 August 2013

అసాధారణ ప్రతిభావంతుడు రాజన్

అసాధారణ ప్రతిభావంతుడు రాజన్
Written by Siramdasu Nagarjuna | Updated: August 06, 2013 18:47 (IST)
అసాధారణ ప్రతిభావంతుడు రాజన్
రిజర్వ్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. అదే రోజు 23 గవర్నర్‌గా రాజన్‌ బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. రాజన్‌ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్‌ బ్యాంకుకు ఐఏఎస్‌ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్‌ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే. ఐఏఎస్‌ కాకపోయినా రాజన్‌కు గవర్నర్‌ పదవి దక్కడానికి ఆయన మేధస్సే ప్రధాన కారణం. అసాధారణమైన ప్రతిభావంతుడిగా రాజన్‌కు పేరుంది. ప్రస్తుతం భారత దేశం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని  ఎదుర్కొంటోంది. ఈ సమయంలో  ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ బాధ్యతలు చేపట్టడం ఆశాజనకమైన పరిణామం.

రఘురామ్‌ రాజన్‌ భోపాల్‌లో 1963 ఫిబ్రవరి 3న జన్మించారు. ఆయన తండ్రి దౌత్యవేత్త.  అందువల్ల 7వ తరగతి వరకు  రాజన్ విదేశాల్లోనే చదువుకున్నారు.  ఆ తర్వాత నుంచి ఢిల్లీలో చదువుకున్నారు. 1985లో ఢిల్లీ ఐఐటీ నుంచి గోల్డ్‌ మెడల్‌తో బీటెక్‌ పట్టా అందుకున్నారు.  అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. బ్యాంకింగ్‌ రంగంపై సమర్పించిన పత్రానికి ఎంఐటి  పీహెచ్‌డీ మంజూరు చేసింది. రాజన్ చికాగోలోని బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో పని చేశారు. ఐఎంఎఫ్ లో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఫైనాన్స్ రంగంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అదే ఏడాది మన దేశానికి గౌరవ ఆర్థిక సలహాదారుగా ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ నియమించారు. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యంత చిన్న వయసులో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

 దువ్వూరి సుబ్బారావు తొలుత మూడేళ్ల కోసం గవర్నర్ గా నియమితులయ్యారు. అనంతరం మరో రెండేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. సుబ్బారావు హయాంలో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఆయన వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లారు. ఈ పరిణామం కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని పెద్ద కంపెనీలు కూడా వాయిదాలు కట్టలేక చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరానికి, సుబ్బారావుకు మధ్య దూరం పెరిగింది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న రాజన్‌ ఈ దూరాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

No comments:

Post a Comment